శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం | ధర్మ సంస్థాపనయ సంభవామి యుగే యుగే ||

ధర్మం నశించి - అధర్మం వృద్ధి చెందినపుడు సజ్జనులను రక్షించటానికి, దుర్జనులను శిక్షించటానికి శ్రీ మహావిష్ణువు తానూ ప్రతి యుగము లోను, జన్మిస్తానని భగవద్గితలో తెలిపియున్నారు.

16 - 17 శతాబ్దాలలో కులాలు - మతాలు పేరుతో అరాచకాలు జరుగుతున్న తరుణంలో సత్య , ధర్మములను భక్తులకు బోధించి , మానవులకు మోక్షజ్ఞ్యానము పొందే - మార్గాలను ఉపదేశించేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారుగా అవతరించినారు. అనన్యశ్చిన్తా యంతోమామ్ యేజానా: పార్యుపాసతే! తేషాం నిత్యాభియుక్తానాం , యోగక్షేమం మహామ్యహం || అన్నట్లు తనను నిత్యము అర్చించే భక్తుల యోగక్షేమాలను చూస్తాననికూడా శ్రీ స్వాములవారు తన భక్తులకు నిశ్చయంగా ఉపదేశించియున్నారు.

"ఓం - హ్రీం - క్లీం - శ్రీం - శివాయ బ్రాహ్మణే నమః " అనే ద్వాదశాక్షరీ మహామంత్రమును ప్రతి నిత్యం 108 పర్యాయములు చదివిన భక్తులకు ఆశయాసిద్ధి కలుగునని - సదా తనను స్మరించిన వారిని సర్వదా రక్షింతునని తన భక్తులకు అభయమిచ్చిన మహా విష్ణు స్వరూపుడు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాములవారు.

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తన దివ్యదృష్టితో రాబోవు కాలములో మానవులు అనుసరించు విధానములను, ప్రకృతిలో జరుగు మార్పులను "సాంద్ర సింధువేదము"గా ప్రసిద్ధి పొందిన సాలజ్ఞాన గ్రంధములో అనేక అద్భుతాలను గురించి తెలిపియున్నారు

శ్రీ స్వామివారు క్రి.శ. 1608 పింగళనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి తిధి యందు పరి పూర్ణయాచార్య - ప్రకృతాంబ అను విశ్వబ్రాహ్మణ దంపతులకు సరస్వతీ నాదీ తీరమున జంమ్మించి వీరపాపమాంబ దంపతులు స్వీకరించి పెంచుచుండిరి. వారి సంరక్షణలో పెరిగి బాల్యములోనే దేశాటనకు బయలుదేరి - బనగానపల్లెలోని గరిమిరెడ్డి గచ్చమాంబగారి ఇంటిలో గోవుల కాపరిగా , జీవితాన్ని ప్రారంభించి , అక్కడగల 'రవ్వలకొండ' గుహలో కూర్చొని - తాళపత్రములపై భవిష్యత్ కాలజ్ఞానం రచించారు. ఎన్ని మతాలున్నా "సర్వేశ్వరుడొక్కడే" అని హిందువులు - ముస్లింలు - క్రైస్తవులందరి నివాసములపై సూర్యచంద్రులు సమానంగా వెలుగును ఇచ్చుచున్నారని, కులాలు - మతాలు, ఇవి మానవ కల్పితాలని - తన రచనలో తెలిపియున్నారు.

17 వ శతాబ్దంలో సమ సమాజ స్థాపనకు శ్రీకారం చుట్టినవారు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబను వివాహమాడి, గృహస్థాశ్రమ జీవితాన్ని స్వీకరించి, కులవృత్తిని నిర్వహించును, ఆధ్యాత్మిక బోధనతో గడుపుతూ, "కందిమల్లాయపల్లె" చేరినాడు. 1693 కీలకనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమినాడు శ్రీ స్వామివారు సజీవ సమాధి పొందినారు.

"అన్నమయములైనవి అన్ని జీవములు, కూడులేక జీవకోటి లేదు, కూడు తినెడి కాడ కులభేదమేల" అని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తన రచనల్లో పేర్కొని, ఆకలికి ధనిక - పెద్ద - కులం - మతం - అనే బేధాలు లేవని తెలిపిన సంఘ సంస్కార శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు.